Online Puja Services

కరుణారసతరంగిణి వారాహి

18.221.13.173

కరుణారసతరంగిణి వారాహి 
- లక్ష్మీ రమణ 

ఆషాడం వచ్చేసింది . చిరు  జల్లులతో పుడమి పులకరిస్తూ ఉంటుంది. ఆడపడుచులంతా చేతికి గోరింటాకులు పెట్టుకొని అమ్మవారి ప్రతిరూపాల్లా నట్టింట్లో తిరుగుతుంటే, ఆ అమ్మ అనుగ్రహాన్ని అర్థిస్తూ రైతన్నలు నాగలి పట్టి పొలాల్లో శ్రమిస్తూ ఉంటారు.  ఇదే సమయంలో వచ్చే వారాహీ నవరాత్రులు చాలా మహిమాన్వితమైన పండుగరోజులు. వీటిని అట్టహాసంగా జరుపుకొనవసరంలేదు .  ప్రతిరోజూ సాయంకాలం అమ్మవారికి దీపం పెట్టి, దుంపలు నైవేద్యంగా సమర్పించి వేడుకుంటే చాలు అనుగ్రహమిచ్చి పంటలు పండేలా దీవిస్తుంది. రాత్రంతా మన వెంటే ఉంటూ, మనల్ని , మన పంటల్ని రక్షిస్తుంది.  సంపదల్ని అనుగ్రహిస్తుంది . అసలు ఈ దేవదేవి మహత్యాన్ని గురించి ఎంతగా చెప్పుకున్న తక్కువే ! వివిధ పురాణాల్లో ఈ దేవి గురించిన కథనాలూ ఎన్నో మనకి  కనిపిస్తాయి.    

ఇచ్ఛాశక్తి ప్రసాదిని - లలితాదేవి , జ్ఞానశక్తి ప్రదాయిని -శ్యామలాదేవి , క్రియా శక్తి ప్రదాత -వారాహి దేవి.  ఈ ముగ్గురమ్మల అనుగ్రహం లేనిదే మనం ఏమీ చెయ్యలేము .  క్రియాశక్తి ప్రదాయని అయినా అమ్మవారిని వారాహిగా ఆరాధించుకొనే మహిమాన్వితమైన రోజులు 

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండీ అంటే 2023 జూన్ 19 వ తేదీ నుండీ మొదలుకాబోతున్నాయి. 

అమ్మవారు సంప్రదాయిని , సంప్రదాయేశ్వరి, సదాచార ప్రవర్తిక! అందువల్ల కావాల్సిందల్లా స్వచ్ఛమైన మనసుతో  సంప్రదాయ బద్ధంగా అమ్మని ఆరాధించి, అనుగ్రహించమని వేడుకోవడమే ! అమ్మవారు మన ఇంటికి వస్తే , ఆమెని సాదరంగా ఆహ్వానించి , చక్కగా పీటవేసి కూర్చోబెట్టి,  కుంకుమ, పసుపు , గంధం, బట్టలు , తాంబూలం సమర్పిస్తామా లేదా ? అదే భావన పూజలోనూ ఉండాలి .  గమనిస్తే ఈ ఉపచారాలన్నీ మనం చేసే పూజలోనూ ఉంటాయి కదా ! అమ్మకి మనసు ముఖ్యం. మనకి యెంత మంత్రం పరిజ్ఞానం ఉందొ అక్కరలేదు.  

మంత్రం ఉండి చేసుకోగలగడం, అదృష్టమే . అయితే గురూపదేశం లేకుండా, మంత్రాల జోలికి వెళ్ళకండి .  డాక్టర్ సలహా లేకుండా వేసుకొనే మాత్రల్లా అవి ఒక్కోసారి వికటించే ప్రమాదముంది. కనుక చక్కని మనసుతో యథా శక్తి అమ్మని వేడుకుంటే చాలు . 

ఇక, వారాహి స్వరూపంలో అమ్మవారి ఆవిర్భావాన్ని గురించి అనేక పురాణాలు చెప్పాయి. వాటిని ఒక్కసారి స్మరించుకుందాం .  గుర్తుంచుకోండి , ఇలా అమ్మవారి దివ్యమైన కథలని చెప్పుకోవడం, తద్వారా స్మరించుకోవడం అనంతమైన పుణ్యాన్ని అందిస్తుంది , అందులో సందేహమే లేదు.  నారద మహర్షి తన భక్తి సూత్రాలలో  శ్రవణం, స్మరణం అనేవి కూడా ఆ పరమాత్మని చేరుకోవడాని మార్గాలే అని చెప్పిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుందాం . 

దేవీభాగవతం, మార్కండేయ పురాణం తదితరాల్లో అమ్మవారి అవతార ప్రశస్తి కనిపిస్తోంది. హిరణ్యాక్షుని బారి నుండీ భూమాతని రక్షించినవారు వరాహ స్వామి. ఆయన స్త్రీ స్వరూపమే వారాహీ మాత.  ఈవిడ సప్తమాతృకల్లో ఒకరిగా కీర్తిని పొందారు . దేవీ భాగవతంలో అమ్మావారు రక్త బీజుణ్ణి సంహరించడానికి తన నుండీ ఏడు శక్తులని సృష్టించారు.  వారే సప్త మాతృకలు . వారిలో అమ్మవారి వీపుభాగం నుండీ ఉద్భవించిన క్రియా శక్తి వారాహి . మశ్చ్య పురాణం ప్రకారం అమ్మవారిని అంధకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు సృష్టించారు. 

వారాహి విష్ణు స్వరూపిణి .  కనుక ఆమె వరాహ స్వామి లాగానే శ్యామల వర్ణంలో ఉంటారు . నాగలి, రోకలి ఆమె ప్రధాన ఆయుధాలు . ఇవి సస్యాల అభివృద్ధిని సూచిస్తున్నాయి కదా ! సాధారణంగా పాము, దున్నపోతు,  సింహం అమ్మవారి వాహనాలుగా ఉంటాయి.  ఇది దేవి దైవత్వాన్ని అలాగే తిరిగి వ్యవసాయ అభివృద్ధిని సూచించేవిగా ఉండడం గమనార్హం . మ్మవారి రూపం చాలా భయం గొలిపేదిగా ఉంటుంది . అయినప్పటికీ కూడా ఆ దేవదేవి సులభంగా అనుగ్రహిస్తారు . 

వారాహీ దేవిని సాయం సమయంలో ఆరాధించడం ఉత్తమం. అమ్మావారు రాత్రంతా కూడా నగర సంచారం చేస్తూ , రక్షిస్తూ ఉంటారు. గ్రామాలని, తన భక్తులనీ, వారు నిద్రించే సమయంలో కూడా చల్లగా కాచే తల్లి వారాహి .  అందుకే సాయం సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసే వారాహీ ఆరాధన గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది . అన్ని సమస్యలూ వారాహీ అనుగ్రహం వలన తొలగిపోయి సానుకూల ఫలితాలు లభిస్తాయి.  కాబట్టి , ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి . 

శ్రీ వారాహీ అనుగ్రహ సిద్ధిరస్తూ!! 

శ్రీ మాత్రే నమః  

#omsrimatrenamaha #varahi #lalita #lalitha #varahinavaratri

Varahi Navaratri, Navratri, Varahi, Lalita, Lalitha, Om Sri Matre Namaha, Varahi Maa, 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore